భాగవతం నుండి
ఈ శ్లోకానికి అపవర్గప్రదం అని పేరు. పరమాత్మ స్వరూపం, పరమాత్మ సన్నిధి కావాలనుకునేవారు నిరంతరం ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాలి.
పంచభూతాలు గాని,కాలము గానీ దేశం కానీ, వ్యక్తి కానీ, అవస్థలు కానీ, నిరంతరం మన ప్రయత్నం చేయకుండా ఉచ్చ్వాస నిశ్వాసలు తీసుకుంటామో మనం ఈ శ్లోకాన్ని అలా అనుసంధానం చేసుకోవాలి
శశ్వత్ప్రశాన్తమభయం ప్రతిబోధమాత్రం
శుద్ధం సమం సదసతః పరమాత్మతత్త్వమ్
శబ్దో న యత్ర పురుకారకవాన్క్రియార్థో
మాయా పరైత్యభిముఖే చ విలజ్జమానా
పరమాత్మ తత్వాన్ని నూటికి నూరుపాళ్ళు మన బుద్ధిలో కూర్చోపెట్టడానికి చేసే ప్రయత్నం ఇది. ఇలా చేస్తే మనకు సందేహాలే కలగవు.
సర్వదా, అన్నిసమయాలలో (శశ్వత్) ప్రశాంతంగా ఉండి (గుణాలన్నీ అణగారిపోయి), ప్రకృతికంటే అతీతుడైనవాడు అయిన పరమాత్మకు గుణాలు ఎలా ఉంటాయి? అందుకే ఆయన ప్రశాంతాత్మ. ఆయనకెప్పుడు భయం ఉండదు (భయం అంటే ప్రమాదం కలుగుతుందేమో అని ఉండే శంక), సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నట్లుగా పరమాత్మ జ్ఞాన స్వరూపుడు, ఆయన శుద్దుడు (నిర్వికారుడు), సమం (ద్వేషం అసూయ లాంటివి లేని వాడు,) ఆయన సత్ అసత్ రెండిటికీ సమం (ఉన్నవాళ్ళకి ఉన్నట్లుగా కనపడతాడు, దేవుడు లేడు అనే వారికి లేనట్లుగా కనపడతాడు)
పరమాత్మ విషయంలో వేదం కూడా చేసే పని ఏమీ ఉండదు ( పురుకారకవాన్). వేద వాక్కు కూడా అక్కడిదాకా వెళ్ళి వెనక్కు వస్తాయి. వేదము కూడా పరమాత్మ స్వరూపాన్ని చెప్పలేదు. అది కూడా పనికి రాదు (నక్రియార్థో). మాయ కూడా పరమాత్మ ఎదురుగా వస్తే సిగ్గుపడి మొహం తిప్పుకుని వెళ్ళిపోతుంది.